నాకెంతో ఇష్టమయిన చిరంజీవి సినిమాల గురించి రాద్దామనుకుంటున్నా ఇవాళ. అసలు ఇప్పుడంటే చిరంజీవి ఇలా చీపయిపోయాడు కానీ వయసులో ఉన్నప్పుడు వైవిధ్యభరితమయిన సినిమాలు చేసినప్పుడూ, ప్రతీ సినిమాలోనూ కొత్తదనం చూపించాలనుకున్నప్పుడూ మా బాగా ఉండేవాడు.
అందుకే నాకభిమాన నటుడయ్యాడు. చిరంజీవి సినిమాలంటే పడి చచ్చేవాడిని. ఆ వేష భాషలను అనుకరించాలని ప్రయత్నించేవాడిని చిన్నప్పుడు. కొంత పెద్దయ్యాక చిరంజీవి డాన్సు చూసిన ప్రతీ సారీ ఫ్లాటయిపోయేవాడిని. ఎన్నో సార్లు చేద్దామని బొక్క బోర్లా పడ్డాను కూడా. ఆ స్టెప్పులు భలే మజాగా ఉండేవి. డిస్కో, బ్రేక్ మొదలయినవి అద్భుతంగా చేసేవాడు.
అలాగని కమర్షియల్ మూసలోనే కాకుండా వైవిధ్యభరితమయిన చంటబ్బాయి, రుద్రవీణ, ఆపధ్భాంధవుడు మొదలయిన సినిమాలలో నటించాడు. కొండవీటి దొంగ, కొదమ సింహం, లంకేశ్వరుడు, రుద్రనేత్ర, మరణ మృదంగం, స్టేట్ రౌడీ, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, రౌడీ అల్లుడు, ఖైదీ నంబర్ 786, గాంగ్ లీడర్, స్వయంకృషి, దొంగ మొగుడు, మగ మహారాజు, ఛాలెంజ్, పసివాడి ప్రాణం, రాజా విక్రమార్క, బావగారు బాగున్నారా, ఠాగూర్, శంకర్ దాదా MBBS, ఇంద్ర అబ్బో చెప్పుకుంటే ఎంత వైవిధ్యభరితమయిన నటనా చరిత్ర ఉంది చిరంజీవికి. అలాంటి సత్తా ఉన్న వ్యక్తి టాలెంటు ఇప్పుడు వేస్టవుతుందే అని కొద్దిగా (చాలా) బాధగా కూడా ఉంటుంది నాకు. కానీ ఏం చేస్తాం. విధి రాత.
ఇక నేనిప్పుడు ఆయన సినిమాలలో నా ఛాయిస్ అయిన వాటి గురించి మాట్లాడతా:
చిరంజీవి నట జీవితంలో ప్రత్యేకమయిన ప్రస్తావన తేవలసిన సినిమాలు ఉన్నాయంటే నాకయితే రెండు స్వయంకృషి, రుద్రవీణ. మిగతా సినిమాలెన్నో నచ్చినవి నాకున్నా ఇవి మాత్రం ఎంతో ప్రత్యేకం. నా హృదయానికి దగ్గరగా ఉంటాయి ఎప్పటికీ. అసలు వీటిని ఎన్ని సార్లు చూసానో నాకే తెలీదు.
స్వయంకృషి: ఈ సినిమా గురించి తలచుకుంటేనే నాకు ఒళ్ళు పులకరిస్తుంది. అద్భుతమయిన కథ/కథనం, అంతకన్నా అద్భుతమయిన నటులు కలిస్తే ఈ సినిమా. కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో తయారయిన మణిపూస ఇది. ఈ సినిమాలో ఎన్నో హైలైట్లు. మొదటిది కృషితో నాస్తి దుర్భిక్షం. చెప్పులు కుట్టే చిరంజీవి స్వయంకృషితో పైకొస్తాడు. ఎదురు దెబ్బలు తగిలినా ఎంతో ఎత్తుకు ఎదుగుతాడు. సినిమా అక్కడితో ఆగితే ఇందులో గొప్పతనం ఉండేది కాదు ఎందుకంటే ఆ తరువాత జరిగే సంఘటనలే ఈ సినిమాకు ప్రాణం. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లవాడు చెడు దారిన పడతాడు ఐశ్వర్యం తో. ఆ పిల్లాడిని తిరిగి ఎలా దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తాడో, ఆ దారిలో నచ్చచెప్పడం, భయపెట్టడం, బుజ్జగించడం, ప్రేమించడం అన్నీ ఆకట్టుకుంటాయి.
చిరంజీవి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి అనే సూత్రం పాటిస్తాడు. మనం "పెద్ద" అయినంత మాత్రాన సరిపోదు మన మనసు కూడా పెద్దదవాలి అని కథ చెబుతుంది. చెడు వైపుకి లొంగడం, క్షణిక సుఖాల కోసం మొగ్గడం సులభం. కానీ కృషి వల్ల వచ్చే సంతోషం దాని వల్ల రాదు అని ఎంత చక్కగా చెబుతుందో ఈ సినిమా. నేను నమ్మే సూత్రాలకు చాలా దగ్గరగా ఉంటుంది ఈ సినిమా. ఓ మనిషిని అతని హోదాతోనో, అతని డబ్బుతోనో, పదవితోనో, పేరుతోనో అంచనా వెయ్యకూడదు. కృషి, పట్టుదల ముందు అన్నీ దిగదుడుపే.
ఈ సినిమాలో "సిగ్గూ పూబంతి" పాట నాకు ఇష్టమయినది.
రుద్రవీణ:కె బాలచందర్ గారి దర్శకత్వంలో వచ్చిన ఇంకో వజ్రం ఈ సినిమా. నటనకి ఎంతో ఆస్కారం ఉన్న ఎన్నో పాత్రలు ఈ సినిమా సొంతం. అలాంటి పాత్రలలో ఎప్పటీకీ గుర్తుండిపోయే పాత్రలో చిరంజీవి నటన అద్భుతం. ఇందులో ఎన్నో అంశాలు స్పృశిస్తాడు దర్శకుడు. సంగీతం అనేది కొందరికి చెందినదిగానే మిగిలిపోకూడదు అందరికీ చెందినప్పుడే దాని గొప్పతనం అనీ, అంటరానితనం / ఉన్నత కులం, నీచ కులం అనే అసమానత రూపుమాపాలనీ, తాగుడుకి బానిస కాకూడదనీ ఈ సినిమాలో చూపిస్తాడు దర్శకుడు.
చిరంజీవి నటన ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళుతుంది. సూర్యం పాత్రలో ఒదిగిపోయి అసమాన నటనా ప్రావీణ్యంతో ఎన్నో భావాలు ఒలికిస్తాడు చిరంజీవి. అలాగే బిళహరి పాత్రలో సూర్యం నాన్నగా నటించిన పాత్ర కూడా ఎంతో అద్భుతమయిన పాత్ర. తన తండ్రి బిళహరి గణపతి శాస్త్రి కి పూర్తి వ్యతిరేకం సూర్యం పాత్ర. వారిద్దరి మధ్య జరిగే ఘర్షణ హైలైటు.
ఈ సినిమాలో "కదలిరాద తనే వసంతం..." నాకెంతో ఇష్టమయిన పాట. అలాగే "రండి రండి దయచేయండి..." పాట కూడా చాలా బాగుంటుంది. (పెంటమ్మ ఘట్టం గుర్తుందా అందరికీ ?)
చంటబ్బాయి: హీరోయిజం ఉన్న చిరంజీవితో డాన్సులు, ఫైట్లు మాత్రమే కాకుండా కామెడీ చేయించిన వినూత్న చిత్రం ఇది. దీంట్లో చిరంజీవి కి ఉన్న కామెడీ టైమింగ్ స్పష్టమవుతుంది. (తన నటనలో ఉపయోగించుకోవలసినంతగా ఉపయోగించుకోలేదని నా విమర్శ). అసలు సినిమా అంతా నవ్విస్తూనే ఉంటుంది. జంధ్యాల గారి చేతిలో రూపు దిద్దుకున్న హాస్య గుళిక ఇది. "పాండ్ జేంస్ పాండ్" గా చిరంజీవి "పాండు" కారెక్టర్ తెగ నవ్విస్తుంది. అదీనూ చిరంజీవి ని చావబాదే కారెక్టర్లో అల్లు అరవింద్... హహహ.. నవ్వుల పండగే.
ఈ సినిమాలో "అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను..." పాట హిలేరియస్...
ఛాలెంజ్:యండమూరి నవలల ఆధారంగా రూపొందించిన చిరంజీవి సినిమాల్లో ఇదొకటి. నిరుద్యోగుల మీద ప్రాక్టికల్ జోకు ప్లే చేసిన రావు గోపాల్ రావు తో చిరంజీవి యాభై లక్షలు సాధిస్తానని చాలెంజ్ చేసి గెలుస్తాడు. కథ పాతదే అయినా బాగుంటుంది.
ఆఖరి సీనులో చిరంజీవి "రామ్మోహనరావు నేనే గెలిచాను..." అరుపు నాకెప్పుడూ గుర్తుంటుంది.
ఇక మోడర్న్ సమయానికి వస్తే
జగదేక వీరుడు అతిలోక సుందరి:అప్పటికే మెగాస్టార్ స్టేటస్ ఉన్న చిరంజీవికి జనాలలో ఇంకా ఎంతో క్రేజ్ పెంచిన సినిమా ఇది. ఫాంటసీ తో రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి, శ్రీదేవి నటన అబ్బో. ఇంద్రుడి కుమార్తె అయిన శ్రీదేవి తన అంగుళీయకం భూలోకంలో పోగొట్టుకోవడం, అది మానవుడయిన చిరంజీవి కి దొరకడం, ఆ అంగుళీకాన్ని చిరంజీవి నుండి వెనక్కి తీసుకురావడం కోసం శ్రీదేవి తంటాలు బహు బాగు ఈ సినిమా. మానవా అంటూ చిరంజీవి ని సంబోధిస్తున్న శ్రీదేవి సంభాషణలు భలే ఉంటాయి.
ఈ సినిమాలో నాకు నచ్చిన పాట "అబ్బ నీ తియ్యని దెబ్బ..." ;)
0 comments:
Post a Comment